21, డిసెంబర్ 2009, సోమవారం

బోల్షివిక్ స్పిరిట్ కా. జోసెఫ్ స్టాలిన్



కా.జోసెఫ్ స్టాలిన్ 130 వ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా విప్లవాభిమానులు ఈరోజు జరుపుకుంటున్నారు. కా.స్టాలిన్ ఒక నిజమైన మార్క్సిస్టు లెనినిస్టుగా బోల్షివిక్ విప్లవ విజయానంతరం కా.లెనిన్ పై హత్యాప్రయత్నానంతరం సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ను ఏకతాటిపై నిలిపి జర్మన్ ఫాసిస్టు, నాజీ దాడులనుండి, బ్రిటన్-అమెరికాల పెట్టుబడిదారీ వర్గాల కుతంత్రాలనుండి కాపాడే ప్రయత్నంలో నిబ్బరంగా నిజమైన కమ్యూనిస్టు యోధుడిగా నిలబడి ఎదుర్కొని ఉండకపోతే ఈ ప్రపంచ పటంలో రష్యాను ఆనాడే తుడిచి పెట్టేయడానికి తమ సర్వశక్తులను ఒడ్డిన రెనగేడ్స్ ను సోవియట్ ప్రజల సాహసోపేతమైన, త్యాగపూరితమైన పోరాట పటిమతోడై అడ్డుకొనగలిగాడు. తన మొక్కవోని ధైర్య, స్తైర్య నిర్ణయాలతో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల పీచమణిచి వుండకపోతే అమెరికా వాడి అవకాశవాద దుర్బుద్దితో, బ్రిటన్ కుయుక్తులతో ఈ ప్రపంచం ఓ సమ సమాజ చిత్రపటాన్ని చూడగలిగేది కాదు. అటు సొంత ఇంటిలో చిచ్చునూ, సభ్య ప్రపంచంలోని కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కొనడానికి కా.స్టాలిన్ తన పూర్తి సమయాన్ని వెచ్చించారు. అందులో ఆయన కరకుగా వ్యవహరించినదానినే కేపిటలిస్టు గ్రూపులు, రివిజనిస్టులూ ప్రపంచానికి చూపెడుతూ తననొక నియంతగా చిత్రీకరించాయి. కానీ ఆ సమయంలో ఆయనలా వ్యవహరించి ఉండకపోతే ఆ కొద్ది సం.లైనా సోవియట్ రష్యా మనగలిగేది కాదు. ఆయన మరణానంతరం మరల మెన్షివిక్కుల చేతుల్లోకి పోయి సైనికంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే పేరుతో తప్పుడు పంథాలో ముంచి రష్యాను పూర్తిగా పెట్టుబడిదారీదేశంగానూ, సామ్రాజ్యవాదదేశంగానూ మార్చి రంగురంగుల ఊసరవెల్లులు తమ ప్రాపకాన్ని పెంచుకొని సోవియట్ ఆత్మను మింగివేసాయి.

LONG LIVE THE SPIRIT OF BOLSHIVISM.
LONG LIVE THE SPIRIT OF MARXISM-LENINISM.
LONG LIVE THE SPIRIT OF JOSEPH STALIN PATH.

(ఈ లింక్ లో మరిన్ని వివరణలు చూడొచ్చుః http://marxistleninist.wordpress.com/2009/12/20/long-live-the-universal-contributions-of-comrade-joseph-stalin/

కోరిక తీరిస్తేనే అన్నం



తమిళ మహిళలతో లంక సైన్యం బేరం

అవి శరణార్థి శిబిరాలా? బాధితుల పాలిటి చెరసాలలా? శ్రీలంకలోని శరణార్థి శిబిరాలలో తమిళ యువతులపై సైనిక భటులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆసియా సంతతికి చెందిన ఓ బ్రిటిష్ మెడికో వనీ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ శిబిరాలలోని తమిళ మహిళలకు ఆహారం కావాలంటే తమ శారీరక సుఖం తీర్చాలని అక్కడ కాపలా ఉండే సైనికులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆమె పేర్కొన్నట్లు ది అబ్జర్వర్ పత్రిక తెలిపింది. LTTE తో సంబంధాలున్నాయనే సైన్యం లాక్కెళ్ళిన వారి ఆచూకి ఇంత వరకూ తెలియలేదని మానవహక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. నాలుగు నెలలపాటు శిబిరంలో బందీగా గడిపి వన్నీ చివరికి తప్పించుకుంది. అక్కడి తమిళ మహిళల పట్ల సైనిక కాపలాదారులు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని, ఖైదీలను గంటలతరబడి ఎండలో మోకాళ్ళపై నిలబెడుతున్నారని వెల్లడైంది.


(ఆంధ్రజ్యోతి-21-12-09 లోని వార్త) ఈ లింకులో ఒరిజినల్ వార్త పూర్తిగా చూడొచ్చుః http://www.guardian.co.uk/world/2009/dec/20/tamil-tigers-sri-lanka-refugees

20, డిసెంబర్ 2009, ఆదివారం

నా తొలి యవ్వనాన్ని పునర్జీవిస్తాను




నలభై ఏళ్ళ విరసం, నూరేళ్ళ శ్రీశ్రీ మహాసభ
ఏప్రిల్ 30, మే 1, 2010, విశాఖపట్నం

శ్రీశ్రీ తెలుగు ప్రజల ఉద్వేగ శక్తి. కవిత్వమనగానే సామాన్య ప్రజలకు సైతం శ్రీశ్రీ గుర్తుకు వస్తాడు. కవి అంటే శ్రీశ్రీ మూర్తిమత్వం రూపుగడుతుంది. సమాజ సాహిత్యాల గురించి, జీవితం గురించి ఆయన చెప్పిన ప్రతి మాటా కవితా చరణంగా నిలిచిపోయింది. ప్రతి కవితా పంక్తి తెలుగువారి నుడికారంలో భాగమైపోయింది. తెలుగు ప్రజల భావోద్వేగాల్లో, అలోచనల్లో మూడు తరాలుగా శ్రీశ్రీ సంలీనమైపోయాడు. సమాజపు గడ్డు వాస్తవాన్ని చెప్పడానికి శ్రీశ్రీ కవితా చరణాలు ప్రజల నిత వ్యవహారంలో ఊంటాయి. వ్యవస్థ పట్ల ఆగ్రహాన్ని, అసమ్మతిని చెప్పడానికి శ్రీశ్రీ కవిత్వమే ఆలంబన. ధిక్కార ప్రకటనకు శ్రీశ్రీ కవిత్వమే ప్రతీక. ప్రజలు జయిస్తారనీ, నిన్నటి కంటే రేపు ఉజ్వలమైనదనీ, చరిత్రను ప్రజలు రచిస్తారనీ చెప్పడానికి ఇవ్వాల్టికీ శ్రీశ్రీని మించిన జనరంజక కవితా శక్తి రూపొందలేదు. అందుకే ప్రజా పోరాట రంగాలన్నింటిలో అర్థ సతాబ్ధంగా తెలుగు జాతి శ్రీశ్రీని పునర్ధర్శించుకుంటోంది.

శతజయంతి ఒక ఉద్వేగ సమ్దర్భంగానేగాక శ్రీశ్రీని పునర్నిర్మించే ప్రయత్నంగా కూడా సాగుతున్నది. ఇది అత్యవసరం. ఈ కాలంలో, ఇవ్వాల్టి చైతన్యంలో శ్రీశ్రీని ఎలా అర్థంచేసుకోవాలి? అనే ప్రశ్న రావడంలోనే ఆయన ప్రాసంగికత ఉన్నది. ఈ పని ఈయన వారసులు, అభిమానులు, వ్యతిరేకులు అనేక వైపుల నుండి సాగిస్తున్నారు. నిజానికి శ్రీశ్రీ తన జీవతకాలమంతా తనను తాను పునర్నిర్మించుకుంటూ వచ్చాడు. లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టోతో ప్రభావితమై బోల్షివిక్ విప్లవోత్తేజంతో కవిత్వంలో శ్రీశ్రీగా ఆవిర్భవించాడు. బోల్షివిక్ విప్లవం ఇవ్వాల్టికీ మానవ చరిత్రలో ఒక మహాద్భుత విజయం. నిజమైన మానవ చరిత్రకు ప్రారంభ బింధువు. మనిషి చేరుకోవలసిన మార్గాన్ని బోల్షివిక్ ఎలుగెత్తి చాటింది. శ్రీశ్రీ అక్కడ పుట్టాడు.. కవిత్వమయ్యాడు. రెండు ప్రపంచ యుద్ధాల సంక్షోభాన్నే గాక రష్యా, చైనా మహత్తర విప్లవాలను ఆవాహన చేసుకున్నాడు. అంతటితో ఆగిపోయిన తెలుగు మేధావులు, రచయితలు చాలా మంది వున్నారు.

శ్రీశ్రీ 1955 మధ్యంతర ఎన్నికల వర్గపోరాటంలో పాల్గొని ఖడ్గసృష్టికి సిద్ధమయ్యాడు. పొద్దువాలిపోతున్న తరుణంలో నవయవ్వనంతో దిగంబరకవులను ఆహ్వానించాడు. దెబ్బై ఏళ్ళ వయసులో చైనా సాంస్కృతిక విప్లవంలో తిరిగి జన్మించి నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల సాంస్కృతిక సేనాని అయ్యాడు. విరసం వ్యవస్థాపకుడిగా పదేళ్ళకు పైగా తన చైతన్యాన్ని విప్లవ సాహిత్యోద్యమంలో సజీవం చేసుకున్నాడు. పునర్జీవం, పునర్నిర్మాణం అనే లక్షణాల వల్ల శ్రీశ్రీ తన చివరి రోజుల దాకా సమకాలీనంగా ఉన్నాడు. యిది వ్యక్తి సుగుణంకాదు. చారిత్రక దృక్పధం, శ్రీశ్రీ ఎంతటి ఉద్వేగ కల్పనా శక్తో అంతటి ఆలోచనాపరుడు. చారిత్రక, తాత్విక దృక్పధం ఉన్న బుద్ధిజీవి. జీవితపు అన్ని దశల్లో ఆయన తేసుకున్న రాజకీయ వైఖరుల వెనుక దృక్పథ స్పష్టత ఉన్నది. భావోద్వేగ పూరితమైన నిమగ్నత ఉన్నది. అందుకే కవి బుద్ధిజీవి, ఉద్యమ జీవి కావాలనే జీవన విలువలను ఆయన నిరూపించాడు. ఇది ఆయనను ఎల్ల వేళలా స్వీయ పునర్నిర్మాణం దిశగా నడిపించింది. ఉద్యమ నిర్మాణాల్లోకి, సంఘాల్లోకి తీసికెళ్ళింది.

చరిత్ర పట్ల అచంచల విశ్వాశం వల్లనే ఆయనకు ఈ మహాప్రస్థానం, మరోప్రపంచ ప్రయాణం సాధ్యమయ్యాయి. చరిత్ర పురోగమిస్తుందని, అది దాని సహజనియమమని శ్రీశ్రీ వలె ఆ తరంలో మరో ఇద్దరు, ముగ్గురు సాహిత్యకారులే తెలుసుకున్నారు. ఆ తరాన్ని ఎన్ని మహోజ్వల చారిత్రక విజయాలు దాటుకొని వెళ్ళాయో అన్నే ఓటములూ, నైరాశ్యాలు ఆవరించాయి. కానీ మార్క్సిస్టు దృక్పధం వల్ల శ్రీశ్రీ చరిత్ర గమనానికి భిన్నంగా వెనకడుగు కూడా వేయలేదు. కాకపోతే కొన్ని సందిగ్ధ సమయాల్లో నిలిచిపోయేవాడు. బైటి నుండి కొంచెం అగ్గి తగిలినా మళ్ళీ ముందడుగే. తానే ముందుండి నడిపించేవాడు.

అయిదు దశాబ్ధాలపాటు పోరాట ప్రజల వెనువెంట సాగిన శ్రీశ్రీ కవితా జైత్రయాత్రను ఇవ్వాళ పునరంచనాలు చేయడం ద్వారా ఆయన సమకాలీనతను పరీక్షించవచ్చు. కానీ చరిత్ర వెంట నడిచి, చారిత్రక శక్తుల ప్రతి మేలుకొలుపు సన్నివేశాన్నీ కవిత్వం చేసి చరిత్రలో భాగమైపోయిన కవిని సైతం చారిత్రక దృక్పథంతోనే తూచవలసి ఉన్నది. శ్రీశ్రీ తన గురించే తానే చెప్పుకున్నట్లు ఆయనలో ఒక విదూషకుడు సైతం ఉండవచ్చుగానీ పొల్లునెల్లు వేరుచేయగల మార్క్సిస్టు దృష్టిని ఆయనే అపారంగా మనకు అందించాడు. ఆయనను అంచనా వేయడానికీ అదే సాధనంకావాలి.

ఆధునిక సాహిత్యంలోకి శ్రీశ్రీ తొలిసారిగా శ్రమను, శ్రమ రూపాలను, మానవ కర్తృత్వాన్ని తీసుకొని వచ్చాడు. సహస్ర వృత్తుల గురించి చెప్పడంలో ప్రజల సాంఘిక అస్థిత్వ స్పృహ ఆయనకున్నది. మార్క్సిజంలోని కీలకమైన శ్రమ సంబంధాలు ఆయన సాహిత్య చైతన్యానికి మార్గదర్శి.

తెలంగాణా సాయుధపోరాట కాలంలో పోలీసు చర్య పేరుతో యూనియన్ సైన్యాలు విప్లవకారులను, ప్రజలను, ముస్లింలను చంపినప్పుడు తెలంగాణాను తనలో ఆవాహన చేసుకున్న హరీంద్రనాథ్ ఇంగ్లీషులో దీర్ఘకవిత రాశాడు. మైకోవిస్కీ రాసిన లెనిన్ కవితను తనదైన శైలిలో అనువదించినట్టే హరీంద్రనాథ్ కవితను శ్రీశ్రీ మొట్టమొదట అనువదించాడు. తెలంగాణాపై ఆరుద్ర త్వమేవాహం చదివి శ్రీశ్రీ ఎంత పులకించిపోయాడంటే.. నేనిక కవిత్వమే రాయక్కర్లేదన్నాడు. ఆంధ్రమహాసభ, ఆంద్రోద్యమ కాలం నుంచి ఆలంపురంలో తెలంగాణా రచయితల సంఘంగా మారడందాకా (ఈ సభల్లోణే కాళోజీ నాగొడవను శ్రీశ్రీ ఆవిష్కరించాడు). అప్పటి తెలుగు రచయితలందరికీ ఉన్నట్టే విశాలాంధ్ర ఆకాంక్ష శ్రీశ్రీకి ఒక సెంటిమెంటుగా ఉండేది. 1972లో విరసం ప్రత్యేక తెలంగాణాను, ప్రత్యేక ఆంధ్రను బలపరుస్తూ తీర్మాణం చేసినప్పుడు తమకు ఆమోదం లేకపోయినా శ్రీశ్రీ, జ్వాలాముఖి తదితరులు కట్టుబడి ఉన్నారు. మూడు తరాలుగా తెలంగాణాలో విప్లవ, ప్రజా పోరాటాలకూ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలకు వెనుక ఉద్వేగపూరితమైన తిరుగుబాటు తత్వంలో శ్రీశ్రీ ప్రేరణ ఉన్నది.

శతజయంతి వేడుకలు ఎంత లాంచనమో మనకు తెలుసు. శ్రీశ్రీ శతజయంతి ఒక వేడుకలా కాకుండా ప్రజల పట్ల, ఉద్యమాల పట్ల నిర్మాణాల పట్ల మన విశ్వాశాన్ని నింపుకునే సందర్భం అని గుర్తిస్తే చాలు. ఓటమిలో, పడిపోవడంలో, నైరాశ్యంలో.. యిక రేపన్నది కనిపించగానే అంధకారంలో సైతం శ్రీశ్రీ కవిత్వం మనలను వేలుపట్టి భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మనిషి మారుతాడా? సమాజం మారుతుందా? అనే సందేహ జీవులకు యిప్పటికీ శ్రీశ్రీ కవిత్వమే సమాధానం. శ్రీశ్రీయే జీవించి ఉంటే కాలాన్ని, ఈ కాల స్వభావాన్ని ఏమని వివరించేవాడు? ఎంత పదునైన కవిత్వం చెప్పేవాడు. ఎంత అచంచల విశ్వాశంలో విప్లవ శక్తుల వెన్నంటి ఉండేవాడు. యుద్ధాల మధ్య పుట్టి, యుద్ధ సంక్షోభాన్ని కవిత్వం చేసి, ప్రజల అజేయ యుద్ధాన్ని గానం చేసిన ప్రజాకవి యివ్వాళ దేశంలో ప్రజలపై, ఆదివాసులపై రాజ్యం చేస్తున్న యుద్ధాన్ని మనందరికన్నా ముందుండి వ్యతిరేకించేవాడు.

శ్రీశ్రీ శతజయంతి ఆయన నూరేళ్ళ సందర్భం కాదు. మన చుట్టూ మనలను ఆవరించిన సంక్షోభాల్లో, ఉద్యమాల్లో మనలను మనం వెతుక్కునే పలు సందర్భాలుగా విస్తరించాలి. అదే శ్రీశ్రీ స్ఫూర్తి. ఆ కాగడాను అందుకోవడానికి విశాఖ సభలకు సాహిత్య ప్రేమికులను, విప్లవాభిమానులను విరసం సాదరంగా ఆహ్వానిస్తోంది.

విప్లవ రచయితల సంఘం,
ఆంధ్రప్రదేశ్.

12, డిసెంబర్ 2009, శనివారం

జాతుల విముక్తి పోరాటాలను సమర్థిద్దాం


దేశ వ్యాప్తంగా ఊపందుకున్న జాతుల విముక్తి పోరాటాలను సమర్థిద్దాం. కా.స్టాలిన్ పేర్కొన్నట్లు దేశాలు స్వేచ్చను, జాతులు తమ విముక్తిని కోరుతున్నాయి. ఎవరి బతుకు వారు బతుకుతామన్న తపనను సమర్థించడం వలన ప్రత్యేకంగా కోల్పోయేదేమీ లేదు. వారి వారి అభివృద్ధిని వారి వారి ప్రణాళికలతో చేసుకునే అవకాశం కల్పించక, అఖండ భారతావని పేరుతో ఇన్నాళ్ళు వారి గొంతునే కాదు వారి వారి సహజ సంపదను కొల్లగొట్టిన పెట్టుబడిదారులు, దళారులు, కంపెనీ పాలకులే ఈ స్వేచ్చా ఆక్రందనలను అణగబట్టినారు. ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి వున్నాయి. బలవంతంగా రుద్దిన సంస్కృతి వలన ఆయా జాతులు తమ ఉనికిని కోల్పోయి పరాన్నభుక్కులుగా మార్చివేయబడడంతో వారి వారసత్వాన్ని కాపాడుకునేందుకు నేడు తమ ప్రత్యేక డిమాండ్ లను ముందుకు తెస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అసమంజస, అసమగ్ర అబివృద్ధి ఏ కొద్దిమందో టాటాలు, బిర్లాలు, మిట్టల్ లు, జిందాల్ లు, వేదాంత కంపెనీల వారికీ, మల్టీ నేషనల్ కంపెనీల వారికీ తప్ప ఈ నేలపై పుట్టి, ఈ మట్టిని నమ్ముకొని మట్టినే తిని బతుకుతున్న వారి జీవనంలో ఏ మార్పు రాలేదు. సెజ్ లపేరుతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక సామంత రాజ్యాలనేర్పాటు చేస్తు సహజ సంపదను కొల్లగొట్టడానికి తుఫాను వేగంతో వస్తుంటే ప్రశ్నించే వారే కరువైనారు. కానీ ఈ దోపిడీ పాలన నుండి విముక్తి కోరుతున్న జాతుల స్వేచ్చాకాంక్షను సమైక్య వాదం పేరుతో అణగదొక్కచూస్తున్నారు. కావున జాతుల విముక్తి పోరాటాలను సమర్థించుదాం. స్వేచ్చా కాంక్షను ఎలుగెత్తి చాటుదాం.

6, డిసెంబర్ 2009, ఆదివారం

బాబ్రీ మసీదు విధ్వంసం - హిందూ ఫాసిజానికి పరాకాష్ట



బాబ్రీ మసీదును కూల్చి 17 సం.లు పూర్తయిపోయినా నేటికీ దోషులు ఎవరో తెలిసినా కనీసం వారిని తాకేందుకు భయపడుతున్నది ఈ దేశ ఓటుబ్యాంకు రాజకీయం. అయోధ్యలో మొదటినుండి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే టెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది. రాముని జన్మ స్థలంగా అక్కడే పది పదిహేను చోట్ల పూజా స్థలాలు వెలిసాయి. ఇదమిధ్దంగా కూడా తెలీని దానికోసం ఒక చారిత్రక కట్టడాన్నే కూల్చి మైనారిటీ మతస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి వారి ఉనికిని సహించలేని స్థితికి తీసుకువచ్చారు. ఆనాటి కుట్రలో ప్రధానమంత్రిగా కూచున్న రాములోరి భక్తుడి అండదండలు లేకుండా, కళ్యాణరాముడొక్కడే చేయగలడా? స్వాములు, మతపెద్దల సలహాలకు తలొగ్గి, ఆనాటి సంఘటనకు ఆలంబనగా కూచున్నది ఎవరో జనానికి తెలుసు. కానీ మాటాడే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. రథయాత్ర పేరుతో శవయాత్రలను ఉధృతంగావించినవారిని వదిలివేసారు.

ఈ దేశ ముస్సోలిని, హిట్లర్ ల వారసులు అద్వానీ, మోడీలు. అధికారం పొందడానికి ప్రజల మనోభావాలతో, ఉద్రేకాలతో ఎలా చెలగాట మాటాడాలో బాగా తెలిసినవారు. వేలాదిమంది హత్యకు బాధ్యులు. వీరికి శిక్షపడిన నాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం వుందని ఋజువు అవుతుంది. అది కలే.

29, నవంబర్ 2009, ఆదివారం

తెలంగాణా పాలస్తీనా కానున్నదా ?

ఈ రోజు కె.సీ.ఆర్. ఆమరణ దీక్షకు కూచున్నట్లుగా ఈ దేశ రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ ను, ముఖ్యమంత్రిని కలిసి నెల రోజులు ముందుగానే శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం కల్పించమని కోరి పూనుకున్నా ఆయనకు ఆ అవకాశం కల్పించకపోవడం అప్రజాస్వామికం. ఆయన కెరీర్ లో తప్పులు చేసి వుండవచ్చు. కానీ తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా గౌరవించాల్సిందే. ఈ మద్య కాలంలో ఏర్పరిచిన ప్రత్యేక రాష్ట్రాలేవీ ఎన్నికల ద్వారా ఏర్పాటుకాలేదు. ఆయా ప్రధాన పార్టీల బలాలను ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని ఏర్పాటు చేసారు. వాటివలన ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా జరిగిన నష్టం లేదు. మరి తెలంగాణా విషయంలో గత అరవై సం.లుగా వారి ప్రజాస్వామిక డిమాండ్ ను గౌరవించకుండా ఈ రాష్ట్రం ఒక రెండు కులాల వ్యాపార అడ్డాగా మార్చుకొని ప్రాంతాల మద్య సమతుల్యాన్ని దెబ్బతీస్తూ తమ స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది లేదు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను విదేశాలకు తరలించి లక్షల కోట్ల రూపాయల దొంగ సొత్తు కూడబెట్టుకున్న వారిని ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చి ఈ రోజు తాము అధికారానికి దూరమై సహజ వనరుల గురించి మాటాడుతున్నారు. అవకాశమున్నప్పుడు దోపిడీకి వెనకాడని ఈ రాజకీయ రాబందులు పీక్కుతిని కళేబరాన్ని మిగిల్చిన క్రమంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో పడి విద్యార్థులను దొంగలను కొట్టినట్లు కొట్టి కసి తీర్చుకున్న పోలీసులకు అధికారం ఎవరిచ్చారు. వారిని ఉసిగొలిపి యూనివర్శిటీలో భయోత్పాతాన్ని సృష్టించి తద్వారా యువకుల నోరుమూయించాలని, ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించ జూస్తున్న రాజకీయ దళారీల బండారాన్ని బయటపెట్టాలి.

ప్రజాస్వామ్యంగా పేర్కొంటున్న వ్యవస్థలో శాంతియుతంగా చేయతలపెట్టిన సత్యాగ్రహాన్ని ఆపాలనుకోవడం వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
యూనివర్శిటీ నుండి పోలీసులను తరిమికొట్టిన విద్యార్థుల చైతన్యం చూస్తుంటే తెలంగాణా మరో పాలస్తీనా కానున్నదా అనిపిస్తోంది. ఈ రెండింటి మద్య సారూప్యం కనిపిస్తోంది. అమెరికా అండతో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడి తమ ప్రాంతంనుండి తరిమివేయబడిన పాలస్తీనా ప్రజలకు జరిగిన అన్యాయమే కళ్ళముందు కదలాడుతోంది.

న్యాయంగా విడిపోయే హక్కును గౌరవించి వారి ప్రజాస్వామిక డిమాండును అంగీకరించడమే అందరి కోరిక కావాలని ఆశిస్తూ..

28, నవంబర్ 2009, శనివారం

జేన్యాబ్ జలలియన్ ఉరిని వ్యతిరేకి౦చ౦డి




కుర్దిష్ ఉద్యమ కార్యకర్త జెన్యాబ్ జలలియన్ ను ఇరాన్ నరహంతక ప్రభుత్వం ఉరితీయాలని చూస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. జలలియన్ కుర్దిష్ ప్రజల స్వేచ్చను కోరుతూ ఉద్యమిస్తున్న కార్యకర్త. ఇటీవలే ఎహ్సాన్ ఫతెహియాన్ అనే కార్యకర్తకు మరణ శిక్ష విధించారు.

జలలియన్ కు సంఘీభావంగా GO PETITION అనే సైట్ వారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పిటిషన్ పత్రాన్ని ఆన్ లైన్ ద్వారా పంపిస్తూ ఆమె విడుదలను డిమాండ్ చేస్తున్నారు. మానవతా వాదులు తమ సంఘీభావాన్ని తెలుపవలసినదిగా కోరుతూ.http://www.gopetition.com/petitions/save-zeynab-jalalian.html

23, నవంబర్ 2009, సోమవారం

పౌరహక్కుల పురుషోత్తంనకు జోహార్లు

సరిగా తొమ్మిది సం. క్రితం ఇదే రోజు శ్రీకాకుళం ప్రాంతంలో అరెస్టయిన కామ్రేడ్ల గురించి పది గంటల ప్రాంతంలోకా.పురుషోత్తంకు ఫోన్ చేసి చెప్పాను. తరువాత కా.వరవరరావు గారికి అదే విషయమై చెప్పాను. వెంటనే ఎలక్ట్రానిక్ మీడియావారికి ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. గంట తరువాత ఇంట్లో అవసరమైన వస్తువుల కోసం తమ ఇంటి ముందరికిరాణా షాపులో కొనుక్కుందామని బయటకు వచ్చిన కామ్రేడ్ని పోలీసు మాఫియా ముఠా తల్వార్లతో దాడిచేసి నరికిచంపారు. ఇదంతా ప్రజలంతా చూస్తుండగానే హత్యచేసిన వాళ్లు తాము వచ్చిన తెల్ల టాటా సుమోలో తాపీగాపరారయ్యారు. హత్య జరిగి పదిహేను నిముషాలైనా జరగకుండానే పోలీసు జాగిలాలతో రంగారెడ్డి జిల్లా ఎస్.పి. సురే౦ద్రబాబు హాజరు. అంత తొ౦దరగా సార్లకు ఎలా తెలిసి౦దో ఎవరికీ అర్ధం కాలేదు. హడావిడిగా శవాన్ని మార్చురీకి తరలించే వాళ్ళను తన సహచరి జ్యోతి అడ్డుకొంది. తన భర్త శవం దగ్గర ఏడ్వనివ్వండి అని వేడుకొంది. వినని పోలీసులపై చెప్పుతో కొట్టింది. దుమ్మెత్తిపోసింది. కొంతమంది పోలీసులు జ్యోతిని కదలకుండా పట్టుకుంటే కనీసం శవపంచనామా జరపకుండానే పోస్టుమార్టంకు తరలించారు. రక్తం మరకలను పోలీసులు కడిగివేయబోగా అడ్డుకుంది. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు హత్య జరిగిన పావుగంటలో వాలిన పోలీసులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. హత్య జరుగుతుందని ముందుగా తెలియకపోతే వారు ఆ స్థలానికి అంత తొందరగా ఎవరూ చెప్పకుండానే ఎలా చేరుకోగలిగారు?

ఎనబై ఐదులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రామనాధంను, ఎనబై ఆరులో కరీంనగర్ జిల్ల అధ్యక్షులు జాపా లక్ష్మారెడ్డిని, తొంభై ఒకటిలో వరంగల్ జిల్లా కార్యదర్శి న్యాయవాది నఱా ప్రభాకర రెడ్డిని పోలీసులు తామే ప్రత్యక్షంగా కాల్చి హత్య చేసి హంతకులుగా ప్రజల అసహ్యానికి గురయ్యారు. దీని నుండి తప్పించుకోవడానికి లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీసి, వారికి ఆయుధాలు, వాహనాలు సమకూర్చి, విచ్చలవిడిగా డబ్బులిచ్చి హంతక ముఠాలుగా ఏర్పరిచి ప్రజా సంఘాల నాయకులను హత్య చేసేందుకుపయోగిస్తున్నారు. కాశ్మీరులో, అస్సాంలో ప్రభుత్వాలు ప్రైవేటు హంతకముఠాల ద్వారా పౌరహక్కుల నాయకులను హత్యచేయించడాన్ని గమనించి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పురుషోత్తంను, ప్రజా గాయకురాలు బెల్లి లలితను, ఉపాధ్యాయ సంఘ బాధ్యుడు కనకాచారిని మరకొంతమంది ప్రజా సంఘ నాయకులను గ్రీన్ టైగర్స్, బ్లూటైగర్స్ పేరుతో హత్యచేయించారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి వారిళ్ళపై దాడులు చేయడానికి, ఫోన్లలో బెదిరించడానికి, కిడ్నాప్ లు చేయడానికి వీరిని వినియోగించారు. ఇందులో కత్తుల సమ్మయ్య అనే వాడిని శ్రీలంకలో దాచేందుకు విమానంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోవడంతో రాజ్యం నైజం బయటపడి ప్రజల అసహ్యానికి గురయ్యారు.

పురుషోత్తం తన చివరి శ్వాస వరకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు. బాలగోపాల్ ఏ.పి.సి.ఎల్.సి.ని వీడిన తరువాత తానే రాష్ట్ర మంతా పర్యటించి హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపారు. న్యాయవాదిగా కోర్టులలో ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేసారు. పాలమూరుజిల్లా ఐజ మండలం చినతాండ్రపాడు గ్రామంలో ఒక మామూలు మద్యతరగతి కరణం కుటుంబంలో అరవై ఒకటో సంలో జన్మించాడు. స్వాతంత్ర్య సమరయోధులు సీతారామారావు, రామ సుబ్బమ్మలకు నాల్గవ సంతానం. సాంప్రదాయ బ్రాహ్మణాచారలను తండ్రి నేర్పజూసినా తన దగ్గర అలానే వుండి పూజలు చేసేవాడు. కానీ తన చిన్న నాటి ఇతర కులాల పిల్లలతో కలిసి భోంచేసేవాడు. వారి ఎంగిలి ప్లేట్లను తానే కడిగేవాడు.

ఆయనకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. బాగా చదువుకొని ఉద్యోగంచేసి వారిని సుఖపెట్టాలనుకునేవాడు. గద్వాలలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో స్నేహితులంతా విప్లవరాజకీయాలు మాట్లాడుతుంటే దూరంగా వుండి తన చదువు తాను చదువుకునేవాడు. ఎనభైలో బి.ఎస్సీ.లో చేరేనాటికి డిగ్రీ కాలేజీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అదే సం. డిసెంబరు నాలుగున ఆర్.టి.సి. బస్సు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేసిన విద్యార్దులపై పోలీసుల కాల్పుల కారణంగా పది సం.ల బాలుడు చనిపోయాడు. అనేకమంది గాయపడ్డడంతో చలించిపోయిన పురుషోత్తం ఇతర విద్యార్ధులతో కలిసి పోలీసు స్టేషన్ తగలబెట్టె కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పటినుండి రాడికల్ విద్యార్ధి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. పాలమూరు ప్రజల పోరులో భాగంగా ఆయుధం పట్టాడు. తరువాత ఎనబై ఏడులో తిరిగి డిగ్రీ చదువు మొదలుపెట్టి పూర్తుచేసాడు. తరువాత పేదవిద్యార్దులకు తన గ్రామంలో ఉచితంగా విద్య నేర్పే స్కూలు నడిపాడు. బి.ఇడి.పూర్తిచేసాడు. గ్రామీణ ప్రాంత విలేకరిగా పనిచేసాడు. తరువాత న్యాయవాద విద్య పూర్తిచేసి న్యాయవాదిగా పేదల పక్షాన పోరాటం మొదలుపెట్టి పౌరహక్కుల సంఘంలో చేరాడు. అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో హత్య చేస్తూ వారి శవాలను కూడా కుటుంబ సభ్యులకివ్వని రాజ్యహింసకు వ్యతిరేకంగా శవాల స్వాధీన కమిటీ పేరుతో గద్దర్ తోను, ఇతర ప్రజా సంఘాల వారితో ఉద్యమాన్ని నడిపాడు. రాజ్య హింసకు వ్యతిరేకంగానే కాకుండా సమాజంలో ప్రజలను అణచివేస్తున్న ఆధిపత్య వ్యవస్థలన్నిటికీ వ్యతిరేకంగా ఒక పౌరహక్కుల నాయకుడుగా ఉద్యమాలు నడపడంలో కృషిచేశాడు.

ఇంతలా తమ పక్కలో బల్లెంలా తయారయిన పౌరహక్కుల నాయకుడిని హత్య చేయడానికి కుట్ర చేసిన పోలీసులు, ప్రభుత్వమే పురుషోత్తం హత్యకు బాధ్యత వహించాలి. కా.పురుషోత్తం ఆచరణ, ఆశయాలు ప్రజల పక్షాన పోరాడే వారికి మార్గదర్శకాలు. అమర్ రహే కా. పురుషోత్తం.


20, నవంబర్ 2009, శుక్రవారం

జోహార్లు కెన్ సారోవివా జోహార్లు


నైజీరియా సైనిక నియంత అబాచా ప్రభుత్వంచే నవంబరు పది పందొమ్మిదివందల తొ౦బై ఐదున ఉరితీయబడ్డ కెన్ సారోవివా మరి ఎనిమిదిమంది ఉద్యమకారులు తమ ప్రాణత్యాగంతో ఒక మహత్తర సత్యాన్ని తెలియజేసారు. సామ్రాజ్య వాదుల అడుగులకు మడుగులొత్తే విధానాన్ని అనుసరిస్తూ తమ తల్లి స్తన్యాన్నే పణంగా పెట్టే పాలకవర్గ కుట్రలకు దేశప్రజానీకం బలవుతున్ననిజాన్ని వెల్లడించారు.

షెల్ దాని అనుబంధ చమురుకంపెనీలు నైజీరియాలోని పాలక సైనిక ముఠా అ౦డద౦డలతో, చమురును ఆబగా పైక౦గా మార్చుకుని కుబేరులయ్యరుగాని, ఆ చమురు క్షేత్రాల వద్ద, పరిసరాలలో పర్యావరణం ఎంతగా నాశనమవుతోందో, ఒగోనీ తెగ ప్రజల సంప్రదాయక పంటలు ఎలా నాశనమయ్యాయో, వారు జీవన భృతి క్రమ౦గా ఎలా కోల్పోయారో, ఇటువంటి విషయాలు పట్టించుకోలేదు. వారు తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఎలుగెత్తి నినది౦చారు. స్వయం పాలనకు డిమా౦డ్ చేశారు.

ఈ ప్రజా౦దోళనను సహజంగానే సైనిక ముతా ప్రభుత్వం అత్య౦త పాశవికంగా అణచివేసింది. మొబైల్ పోలీస్ ఫోర్స్ ఒగోనీ ప్రజల ఆ౦దోళననలనణచివేయడానికి మొదటిసారి తొంభైలో ఏనాభి మందిని ఊచకోత కోసి౦ది. నాలుగువ౦దల తొ౦బైఐదు ఇళ్ళను ధ్వస౦ చేసి౦ది. మరల తొ౦బై రె౦డు వేసవిలో ఘరాన్ చమురు క్షేత్రం వద్ద వున్నా గ్రామాలపై ఈ ఎం.బి.ఎఫ్ దాడి చేసి ముప్పై మ౦దిని చ౦పిది. నూటా ఏభై మ౦దిపై లాఠీ చార్జీ చేసింది.

దీనిని అంతర్జాతీయ వేదికలలో మాట్లాడి ప్రప౦చ ప్రజల దృష్టికి ఈ సమస్యను తీసుకు వచ్చారు. తొ౦బై రె౦డులో యు.ఎస్.వర్కి౦గ్ గ్రూప్ ఆన్ ఇ౦డియన్ పాపులేషన్ సమావేశంలో (జెనీవా) మాట్లాడారు. అక్కడిను౦చి న్యూయార్క్ లోని యు.ఎన్.ఓ.సమావేశ౦లో మాట్లాడుతూ, 'చమురు వెలికితీత వల్ల-తగు జాగ్రత్తలు, రక్షణలు పాటి౦చక నిర్లక్ష్యం చేసిన౦దువలన ఒగోనీ నేడు మరుభూమిగా మారిపోయింది. దీనికి బదులుగా మాకు లభి౦చేదేమ౦టే ఒక పెద్ద గు౦డు సున్నా మాత్రమె' అన్నారు.

దీనితో శానీ అబాచా సైనిక ముఠా ప్రభుత్వం ఒగోనీలను అణచడానికి ఇరుగుపొరుగునున్న స్వదేశీ తెగల వారిని వారిపైకి ఉసిగొలిపి౦ది. ( సల్వాజుడుం, హర్మద్ వాహిని వంటివి భారత పాలక వర్గ హంతక ముఠాలువీటికి నేటి ప్రతిరూపాలు )

కెన్ సారో వివా నెలకొల్పిన ఎం.ఓ.ఎస్.ఫై.ఓ స౦స్థ షెల్ ను పది బిలియన్ డాలర్ల నష్ట పరిహార౦గా ఇవ్వాలని, దేశం విడిచిపోవాలని డిమా౦డ్ చేసి౦ది.

దీనిపై ఆగ్రహించిన సైనిక ప్రభుత్వం కెన్ సారోవివా ను మరి ఎనిమిదిమ౦ది ఉద్యమకారులను ఉరితీసి౦ది. కెన్ సారో వివా నలబై ఒకట్లో అక్టోబర్ పదో తేదీన రివర్స్ స్టేట్ రాష్ట్ర౦లో జన్మి౦చారు. గొప్ప జాతీయవాది. మహామేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ప్రత్యక్ష వలసపాలన ను౦డి నైజీరియా బయటపడిన తోలి స౦వత్సరాలలో ప్రభుత్వ పాలనాదికారిగా, అరవై ఎనిమిదిలో రాష్ట్ర మ౦త్రివర్గ౦లో కేబినేట్ మ౦త్రిగా పనిచేసారు. ఆయన నాలుగు నవలలు, రె౦డు కథా స౦పుటాలు, ఒక కవితా స౦పుటి, నాటికలు, తొమ్మిది పిల్లల పుస్తకాలు రాసారు. ఆయన రచనలు ఒగోనీ ప్రజల అ౦తరాత్మను ఆవిష్కరించాయి.

మీ సమాధిపై వు౦డే శిలా ఫలక౦పై ఏమిరాస్తే బాగు౦టు౦దని అడిగిన విలేకరితో వివా ఇలా చెప్పారు:
'నైజీరియా చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత౦గా నిద్రపోతున్నాడు. వారు ఆయనకు సాధారణ౦గా అవసరమైన ఆరుఅడుగుల నేలనుకుడా తిరస్కరించారు'.

"ప్రభు! నా ఆత్మను స్వీకరి౦చు. కానీ, పోరాట౦ కొనసాగి తీరుతుంది" అన్నది వివా చివరి మాట.

కలలు క౦టూ చనిపోవాలని ఆశి౦చిన వివా కోరిక నిజ౦ కాకపోవడ౦ విషాదం.

చివరిగా ఇదే విధమైన అపార సైనిక, అధికార బలగాలతో అబూజ్ మడ్ (అపార ఖనిజ వనరులు కలిగిన దండకారణ్యం) ప్రా౦తంపైదాడిచేస్తు అక్కడి ఆదివాసీ ప్రజానీకాన్ని తరిమివేస్తూ, వారి గ్రామాలను తగలబెడుతూ,
స్వదేశంలోనే కా౦దిశీకులుగా మారుస్తున్నమేకవన్నెపులులప్రభుత్వం సామ్రాజ్య వాదుల అడుగులమడుగులొత్తుతున్న తీరును ప్రజాస్వామిక వాదులు తప్పక ఖండించాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు ఈ దేశ వనరులు మిగలనివ్వకుండా అమ్ముకునే కుట్రకు బలి అవుతాం.

('కెన్ సారోవివా కోసం' పేరుతో జనసాహితి ప్రచురణలనుండి సమాచారం)






14, నవంబర్ 2009, శనివారం

ఏ బాలల దినోత్సవం?


ఈరోజు బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా నెహ్రూ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆయనకు బాలల పట్ల వున్న ప్రేమను ఇలా మనం జరుపుకోవడంలొ అభ్యంతరం వుండదెవరికీ. ఆయన జేబులో తురుముకున్న ఎర్ర గులాబీ, ఆయన చుట్టూ చేరిన బాలల ఫోటోలతో మనకు ఒక స్వచ్చమైన రూపం కనులముందు కదలాడి ఆయనకు పిల్లల పట్ల వున్న ప్రేమను గుర్తింప చేస్తాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా నేటికీ మనం బాలల హక్కులపట్ల, వారి భవిష్యత్ పట్ల సరైన ప్రణాళికలు రూపొది౦చుకోలేకపోయా౦.

లక్షల మంది శిశువులు లింగ వివక్షకారణంగా పిండం రూపంలోనో, లేక పుట్టిన తరువాతనో హత్యకావించబడుతున్నారు. దీనికి పరోక్షంగా మన సమాజంలోని వరకట్న దురాచారం, ఆడవారిపట్ల వున్న చిన్న చూపే కారణం.

అలాగే ప్రాథమిక విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ ఎంతో మంది బాలలు బడిమొహం చూడకుండానే వుండిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే వీరి సంఖ్య డబ్భై లక్షల వరకు వుంది. వీరిలో వికలాంగులు, వలస కార్మికుల పిల్లలు, వీధి బాలలు, బాల కార్మికులు వంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలలే అధికం.

కోటీ ముప్ఫై లక్షలమంది బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. ఈ సంఖ్య ఆరు కోట్లవరకు వుంటుందని ఎన్.జీ.వో సంస్థలు అంటున్నాయి. ప్రతి పది మందిలో ఇద్దరు బాల కార్మికులుంటున్నారని సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్చంద సంస్థ పేర్కొంటోంది. ఇంకా మూడేళ్ళ లోపు వయసు వారిలో నలబై ఆరు శాతం మంది బరువు తక్కువుగా వుంటున్నారు. మొత్తం పిల్లలలో డబ్బై శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలలో ఏటా ఇరవై లక్షలమంది నివారించదగ్గ, చికిత్సకు లొంగే చిన్న, చిన్న జబ్బులతో మరణిస్తున్నారు. ఏటా నాలుగు లక్షలమంది శిశువులు పుట్టిన ఇరవై నాలుగు గంటలలోనే కన్నుమూస్తున్నారు. శిశుమరణాల రేట్లో భారతదేశ పరిస్థితి బంగ్లాదేశ్ కంటే ఘోరంగా వుంది. ప్రతి వెయ్యి జననాలకు డబ్బై రెండు మంది మరణిస్తున్నారు. శిశు మరణాలలొ భారతదేశం నూటడబ్బై ఒకటో స్థానంలో వుంది.

ఇవి మన సర్కారు గణాంకాలాధారంగా తెలియజేస్తున్నవే, ఇంకా ఎవరూ నమోదుచేయని గిరిజన ప్రాంతాల పరిస్థితి కలుపుకుంటే ఇంకా ఘోర పరిస్తితి తెలియవస్తుంది. ఎంతోమంది గిరిజన ప్రాంత శిశువులు సరైన రహదారి సౌకర్యం లేక, ప్రాంతాల పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రక్త హీనత, పౌష్టికాహార లోపంతో మూడేళ్ళలోపునే మరణిస్తున్నారు.

మన కనులముందే కుటుంబ ఆర్థిక పరిస్తితులు, సామాజిక వివక్ష కారణంగా ఎంతో మంది బాలలు వీధి బాలలుగా, బాల కార్మికులుగా అత్యంత దయనీయ పరిస్తితులలో జీవనం సాగిస్తున్నారు. ప్రతియేటా బాలల దినోత్సవం నాడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి వారి పట్ల ప్రేమను ఒలకబోసే పాలక వర్గాలు ఏనాడూ సరైన కార్యాచరణ ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేసిన పాపాన పోలేదు. మన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల వర్యులకు పుష్పగుచ్చాలు అందించి ఫోటోలకు ఫోజులిచ్చి, నవ్వులు చిందించే బాలలలో ఎవరైనా అనాధ బాలలుంటారా? పుట్టుకతోనే బంగారుచెంచాతో వచ్చిన వారు తప్ప. వారి పండగనే దేశంలోని అందరు బాలల పండగగా ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారు.

మన విద్యారంగంలో నేడు అమలౌతున్న సంస్కరణలు కూడా బాలల హక్కులను హరించేవిగానే వుంటున్నాయి.

అలాగే ఎంతోమంది ఆడపిల్లలు బాల్యంలోనే వేశ్యావాటికలకు అమ్మివేయబడి నరక కూపాలలో మగ్గిపోతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ పట్ల వున్న కౄర వ్యామోహం దీనికి కారణం. ఇది మన పాలక, రక్షకభటులకు తెలిసే జరుగుతోంది. కలకత్తాలోని సోనాపురీ, బొంబాయి, ఢిల్లీ వంటి మహా నగరాలలోని రెడ్ లైట్ ఏరియాలలో ఇది ఒక మాఫియాగా నడుపబడుతోంది. (నొయిడాలో ఒక పెద్దమనిషి ఎంతో మంది పిల్లలను లైంగికంగా హింసించి, చంపి పాతరేస్తే సరైన సాక్ష్యాలు లేవనీ మన గుడ్డి న్యాయస్థానం వదిలిపెట్టింది).

వీటన్నింటిపట్ల ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి, చిత్తశుధ్ధితో అమలు చేసిన నాడే మనం బాలల దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కును పొందుతాం.

9, నవంబర్ 2009, సోమవారం

మార్క్సిస్టు పార్టీగా పిలవబడడానికి అర్హత వుందా?


రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు. చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని, దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని. ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి.ఇ.ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు. ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు. చైనా కేపిటలిస్టు పంథాలో, డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు. తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు, సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు. పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు. వీళ్ళ ఝెండా, ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు. కా.లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు.

ఈ రెండు పార్టీలకు నాదొకటే విజ్ఞప్తి: మీ ఝెండాల రంగు, గుర్తులు, పార్టీల పేరులు మార్చుకొని మీ నిజస్వరూపాన్ని ప్రజలముందుంచండి. వాటిని వాడుకునే హక్కు ఇంకెంతమాత్రమూ మీకు లేదు.

5, నవంబర్ 2009, గురువారం

మన విశ్వవిద్యాలయాలను మూసేయాలి


మన విశ్వ విద్యాలయాలలో నేడు అలముకున్న ఒక నిస్పృహ వాతావరణం పోవాలంటే వాటిని కొద్దికాలం మూసేయడమే మంచిదని నా విన్నపం. ఎందుచేతనంటే అవి నేడు ఎందుకూ పనికిరాని మురికి కూపాలుగా తయారయ్యాయి. కులగజ్జి ఆచార్యుల కనుసన్నలలో పనికిమాలిన సబ్జెక్టులపై డాక్టరేట్లివ్వడానికి తప్ప నేడు వాటి వలన సమాజానికి నిజంగా ఏమీ ఉపయోగం జరగడం లేదు. వాటినుండి ఏ కొత్త ఆలోచన కానీ, సృజనగానీ కొన్నేళ్ళుగా రూపొందడంలేదు. అటు సాంఘిక శాస్త్ర అంశాలపట్లగానీ, సైన్సు అంశాల పట్లగానీ ఒక కొత్త అంశం కనుగొన్న పాపాన పోలేదు. ఎంతసేపూ స్నాతకోత్సవ జాతర నిర్వహించి తైతక్కల సినిమావాళ్ళకు, రౌడీ రాజకీయనాయకులకు డాక్టరేట్లు అమ్ముకుంటూ కోట్ల కొలది ప్రజా ధనాన్ని చాన్సలర్లు, పీఠాధిపతులు మింగేయడానికి పనికి వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వేటలో పడ్డ పనికిమాలిన యువతకు భోజనాల బోర్డింగ్ లుగా మారిపోయాయి. కెరీరిజం మోజులో తన చుట్టూ జరుగుతున్న సామాజిక దోపిడీని పట్టించుకున్న తీరిక లేని వెధవలను తయారుచేస్తున్నాయి. గత ఇరవై యేళ్ళుగా యువత ఎందుకూ కొరగాకుండా జీతగాళ్ళుగా మార్చే సాధనాలుగా తయారయ్యాయి. సామాజిక రుగ్మతలకు కారణాలను అణ్వేషించి, వాటినుండి బయటపడే మార్గాన్ని ప్రజలకు నిర్దేశించే ఉపకరణంగా ఉండవలసిన విద్యా విధానాన్ని భ్రష్టుపట్టించిన ఈ కులగజ్జి కూపాలను కొంత కాలం మూసేస్తే కడుపుమండిన వాళ్ళైనా దానికి కారణాలను వెతికే పనిలో పడతారని నా ఆలోచన. లేకపోతే ఈ రాచకురుపు వలన సమాజానికి తీవ్రమైన నష్టమే తప్ప లాభం లేదు. నెత్తురు మండే శక్తులు నిండే యువత రావాలి. ఆనాడే ఈ దేశం, ఈ సమాజం బాగుపడుతుంది.

28, అక్టోబర్ 2009, బుధవారం

I never speak Telugu మన విద్యా తాలిబానిజం:

కడప జిల్లా మైదుకూరులోని సైయింట్ జోసెఫ్ పాఠశాలలో పిల్లలు తెలుగులో మాట్లాడితే వారి మెడలో నేరస్థులులా ఐ నెవెర్ స్పీక్ తెలుగు అని రాసివున్న బోర్డులు వేలాడదీయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇది ఆ యాజమాన్యం తప్పేనా? తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదా? ఆ విధంగా చేయడం ఆ టీచర్ చేసిన తప్పే అనుకుందాం. కానీ అమ్మ, నాన్న అనడమే నేరంగా వారి వీపును చీరేసే తల్లిడండ్రులు ఎంతమంది లేరు. అలా అనడాన్ని చిన్నతనంగా భావించే వారు ఎంతమంది లేరు.

హాయిగా ఆట పాటలతో చదువు నేర్చుకోవాల్సిన వయసులో వారిపై మనం మోపుతున్న కేజీల భారం నేరం ఎవరిది? ఎన్ని ఎక్కువ పుస్తకాలు కొనిపిస్తే ఆ కాన్వెంటే బాగుందనుకోని వారెవరైనావున్నారా? ఎంత తీరిక లేకుండా హోం వర్కులిస్తే వారే అత్యంత శ్రద్ధతో చెప్పినవారనుకుంటాం. ఇది పిల్లలపై వేస్తున్న మానసిక వత్తిడి గురించి ఆలోచించేమా ఎప్పుడైనా? ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ప్లే కార్డులు పట్టుకొని రోడ్లపై రావడమే కాని వారిలో ఎంతమంది నిజానికి ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియంలో చదివించేవారున్నారు. వార్తా చానళ్ళకునిన్న ఏ మసాలావార్తా లేకపోవడంతో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మలుచుకొని కాలంగడిపేసారు.

నిజానికి పిల్లల మన:స్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పాఠ్యాంశాల బోధన వారి మాతృ భాషలో జరిగితే అది వారి విజ్ఞాణ వికాశానికి సృజనాత్మకతను పెంచేందుకు  దోహద పడుతుంది. దీనిని పట్టించుకున్న వారు లేరు. నేడు మన ప్రధాన మంత్రి నుండి చాలా మంది నాయకులు, అత్యున్నత స్థానాలలోవున్న వారంతా నూటికి 90 శాతం మంది గ్రామీణ ప్రాంతంనుండి వచ్చిన వారే. నాడు ప్రభుత్వ ప్రాధమిక  పాఠశాలలో చదువుకున్న వారే? మరి వారికి ఇంగ్లీ షు భాషా ప్రావీణ్యతలేదా? అంతెందుకు ఉత్తరాంధ్రా వెనుకబడిన ప్రాంతానికి చెందిన తెలుగు సాహితీ దిగ్గజాలైన మహాకవి గురజాడ, మహాకవి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, చాసో, పతంజలి మొ.న వారు ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ చేసారు? వారు చదవని ఆంగ్ల సాహిత్యంవుందా? భాషనేర్చుకోవాలన్న శ్రద్ధ వుంటే అది కష్టంకాదు. బలవంతంగా రుద్దుతూన్న మనం తాలిబాన్లకు తీసిపోతామా?

పోటీ ప్రపంచం పేరుతో మన ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిల్లలపై అధిక భారంతో పాటు మానసిక వత్తిడిని పెంచి వారిని డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చుతున్న మనదే ఈ నేరం. దీనికి తోడు కొత్తగా సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఒకటో తరగతినుండే్ ఆంగ్ల మాధ్యమంలో బోధించమని శాసనాలు చేస్తున్న ప్రభుత్వానికి భాగస్వామ్యంలేదా? కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్న నాయకమ్మన్యులదే ఈ నేరం కాదా? పాపం పసివాళ్ళు.

22, అక్టోబర్ 2009, గురువారం

'A Seminaar on No to Use of Army & Airforce Against the people'


Naujawan Bharat Sabha invited you to "A Seminar on NO to Use of Army & Air Force Against the People" on 24 అక్టోబర్ ‌న 15:00 ‌కు. కార్యక్రమం: A Seminar on NO to Use of Army & Air Force Against the People What: Protest ప్రారంభ సమయం: 24 అక్టోబర్ ‌న 15:00 ‌కు ముగింపు సమయం: 24 అక్టోబర్ ‌న 18:00 ‌కు స్థలం: Speaker’s Hall, Constitution Club, New Delhi

21, అక్టోబర్ 2009, బుధవారం

ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనక చిదంబర రహస్యం

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంగా ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమం ఎవరి గురించి చేపట్టారు? నిజానికి ఈ రోజు నూటా పది కోట్లకు పైగా జనాభా కలిగిన భారత దేశంలో మావోయిస్టు పార్టీ వెనక వున్నజనం ఎంతమంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా నాలుగువేలమంది సాయుధ మావోయిస్టు సభ్యులున్నారని తెలుస్తోంది. మరి వీరి గురించి సుమారు లక్షకు పైగా సైన్యాన్ని తరలించే కార్యక్రమం చేపట్టిన దేశీయ వ్యవహారాల మంత్రి ఇదంతా ఎవరికోసం చేస్తున్నట్లు. శ్రీలంకలో రాజపక్సే ఎల్టీ టీఈ వారిని సైనిక చర్యల ద్వారా అత్యంత పాశవికంగా అణచివేసిన స్ఫూర్తితో ఇక్కడ కూడా అదే పద్ధతిలో మావోలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే వీరి కార్యక్రమం వలన వేలాది గిరిజన ప్రజానీకం నిర్వాసితులవుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది వూచకోతకు గురయ్యారు. దీనిని ఆపేందుకు సిటిజన్స్ ఇనిశియీతివ్ ఫర్ పీస్ పేరిట నిన్నను ఢిల్లీలోజరిగిన ఒక సమావేశంలో దీశావ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, మాజీ న్యాయమూర్తులు, పౌరహక్కుల సంఘాల నేతలు దేశంలో అంతర్గత యుద్ధం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. దీనికి సమాధానంగా చిదంబరం మావోలు హింసను విడనాడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాని ఆయన ప్రకటనను నమ్మేందుకు ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరు నమ్మలెరని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ వ్యాఖ్యానించారు. ఇటివల ఒక విదేశీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచిదంబరం మాటలకు చేతలకు మధ్య వున్న వైరుధ్యాన్ని ఆమె వివరించారు. చిదంబరం హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాది. దేశ చరిత్రలో మొదటిసారి అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం జరిపిన ఎన్రాన్ సంస్థకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. సెక్యూరిటీకుంభకోణం లో పాలుపంచుకున్న ఫైయిర్ గ్రోత్ కంపెనీలో వాటాలు కొన్నందుకు పీవీ హయాంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఒరిస్సాలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కార్పోరేట్ సంస్థ వేదాంత గవర్నర్ల బోర్డ్ లో చిదంబరం వున్నారు. ఆర్దిక మంత్రి అయిన మొదటి రోజే ఈ బోర్డ్ కు రాజీనామా చేసారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆర్ధిక మంత్రి అయిన తర్వాత వాటినుండి వైదొలిగారు. అయితే చిదంబరం స్థానంలో ఆయన సతీమణి నలిని ఆ కేసులను వాదించడం యాదృచ్చిక మాత్రం కాదు.

ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలు నగరాల్లో జీవిస్తే దేశం బాగుపడుతుందని ఆయన ఒకసారి ప్రకటించారు, అంటే దాదాపు డబ్భై కోట్ల మంది దాకా పల్లెలు ఖాళీ చేసి పట్టణాలలో పడాలన్నమాట. దీనిని సాధించేందుకు లక్షలాది మంది సైన్యాన్ని గ్రామాలకు తరలించి ఖాళీ చేయిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలతోను, ఉపగ్రహ సహకారంతోను మావోయిస్టులను అణచివేసేందుకు లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. నిజానికి ఇదే చైతన్యంతో మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు ఈ దేశంలో గత అరవై రెండు సం.లుగా ఏలిన ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు., ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ దృష్టి మళ్లడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ కంపెనీలకు అవకాశంకల్పించేందుకు మాత్రమేనన్నది చిదంబర రహస్యమేమీ కాదు. విదేశి కంపెనీలు ఈ దేశంలో స్వేచ్చగా అడుగు పెట్టేందుకు చిదంబరం వంటి ఆర్ధిక మంత్రి కావలసి వచ్చాడు మన్మోహన్ సింగ్ కు. అలాగే ఇప్పుడు వారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అడ్డుపడుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు హోం మంత్రి రూపంలో చిదంబరం అవసరమయ్యాడు. చర్చలు జరిపినా, అందుకు మావోయిస్టులు అంగీకరించినా చిదంబరం ఆదివాసీలను తమ ప్రాంతంలో తామూ నివసించేందుకు అనుమతిస్తారా? అంతర్గత యుద్ధం చేయడానికి ఇంతగా ముందుకు వచ్చిన తరువాత చర్చలు అన్నవి ఒక ముసుగు మాత్రమె. తెల్లపంచే, దోవతిలతో, చెరగని చిరునవ్వుతో అడ్డు నామంతో దర్సనమిచ్చే ఈ గోముఖ వ్యాఘ్రం వెనక వున్న శక్తి సామ్రాజ్య వాదమని వారి పెట్టుబడితో, ఆయుధ, సాంకేతిక సహకారాలతో విరుచుకు పడుతున్నది కార్పోరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని అర్థం కాని ముర్ఖులేవరున్నారు.

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దళారి బూర్జువాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు వీలుగా వత్తిళ్ళు చేయడమే వీరి ఉద్దేశ్యం. టాటాలు, మిట్టల్స్, రుయాలు, జిందాల్స్, బిర్లాలు, వేదాంత, పోస్కో కంపెనీలు యుపియే నేతలకు ఎన్నికల నిధులు సమకూర్చాయి. వారి దోపిడీని అడ్డుకునే ప్రథాన శత్రువు దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. అందుకే వారి అడ్డును పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే పేరుతొ ఆదివాసీ ప్రాంతాలను అప్రకటిత యుద్ధానికి సిద్ధమయింది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు మేధావులు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. నిజానికిది నక్సలిజం పై యుద్ధం పేరుతొ సహజ సంపదను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రగానే గుర్తించాలి.

11, అక్టోబర్ 2009, ఆదివారం

మరణం - నిస్సహాయతా? - నిరసన ?

నా సాహితీ మిత్రుడు నిత్య అధ్యయనశీలి, విమర్శకుడు, కవి, కథారచయిత అయిన శ్రీ పడాల జోగారావుగారు శ్రీకాకుళం లోని కథానిలయం చెంతనే వున్న తన స్వగృహంలో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొ౦త కాల౦గా ఆయన కుటుంబ౦లోని నమ్మక ద్రోహానికి వ్యతిరేక౦గా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ౦డేవారు. దానికి తోడు నిత్యము అరకొర జీత౦తో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు. దగ్గర్లోని కాళీపట్న౦ రామారావు మాస్టారు, శ్రీకాకుళ సాహితీ అధ్యక్షులు శ్రీ బి.వి.ఏ.రామారావునాయుడు మాస్టారుగారు, మిస్క క్రిష్నయ్య మాస్టారు ఆయనకు చేదోడు వాదోడుగా వుంది సహకరి౦చేవారు. కానీ తాను నమ్మిన విలువలను తూచా తప్పక పాటి౦చే మనిషి కావడ౦తో తాను గురిఅయిన నమ్మక ద్రోహాన్ని మరిచిపోలేని తన౦తో నిత్యము స౦ఘర్శణకు లోనయి నిన్నటికి మరి ఏ విషాదకర మాటల ఈటె తగిలి౦దో గాని బద్దలైన తన గు౦డె గాయానికి పురుగులమ౦దుతో ఆర్పాలనుకోవడ౦ విషాదకర నిర్ణయ౦. మిత్రులందరికి తాను అన్ని రకాల స౦దేహ సమయాలలో తోడుగా వు౦డి గైడ్ చేసిన మనిషి ఇ౦త బాధాకర నిర్ణయంతో మమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసిపోయారు.

తాను కథలు రాసినవి తక్కువే అయినా జీవితానుభవాలతో నలుగురికి ఆలోచనాత్మక౦గా వుండేవి, కవితలలో కూడా తాను జీవిత స౦ఘర్శణనే ఆవిష్కరించే వారు. ముఖ్యంగా తన మిత్రులతో పాటు తనను వ్యతిరేకి౦చే వారికైనా విశ్లేషణాత్మక౦గా మ౦చి వివరణలతో సుదీర్ఘమైన వుత్తరాలు రాసి గైడ్ చేసేవారు. తొలినాళ్ళలో ర౦గనాయకమ్మ గారితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చర్చలు చేసే వారు. అలాగే చేరా గారితోనూ. కథానిలయ౦ కార్యక్రమాలలో అన్నీ పాలుప౦చుకొని తన విలువైన భాగస్వామ్య౦తో ఎ౦తో సహకరి౦చారు. శ్రీకాకుళం లో జరిగే ప్రతి సాహితీ కార్యక్రమాలలో ము౦దు౦డేవారు. అటువ౦టి సాహితీ మిత్రుడిని కోల్పోవడ౦ ఒక్క శ్రీకాకుళ మిత్రులకే కాదు సాహితీ ర౦గానికి కూడా తీరని నష్టమే.

ఆత్మ హత్య ద్వారా తాను తెలియచేసిన నిరసనకు నా స౦ఘీభావాన్ని తెలియచేస్తూనే అది వ్యవస్థ చేసిన మరో క్రూరమైన హత్యగానే భావిస్తున్నాను.

10, అక్టోబర్ 2009, శనివారం

రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు మన బాలగోపాల్


కా.బాలగోపాల్ వంటి మేధావిని సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
బాలగోపాల్ గారితో నాకు ఎనభై ఏడు నుండి పరిచయం వుంది. డిగ్రీ చదివిన తరువాత అదే వూపులో పౌరహక్కుల సంఘం సభలకు తరచుగా హాజరయ్యేవాడిని. సార్ విశాఖ వస్తారని తెలియగానే వెళ్ళేవాడిని. ఆయన వున్నన్నాళ్ళు కలిసి వుండే వాడిని. వి.ఎస్. కృష్ణా (ఇప్పుడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి) గారి ఇంటిలో బసచేసేవారు. కృష్ణ జే.ఎన్.యు.నుండి వచ్చిన కొత్తలో చాలా ఇటరెస్టి౦గ్ గా వుండే వాడు. పుస్తకాలు పై చర్చలు జరిగేవి. రోజుల్లో ఎక్కడ ఎదురుకాల్పులు జరిగినా, వరకట్న హత్యలు జరిగినా, దళితులపై దాడులు జరిగినా సార్ వెంటనే వచ్చేవారు. పౌరహక్కుల సంఘానికి తానె అన్నిఅయి పనిచేసేవారు. ఎంతటి ఇ౦టీరియల్ ప్లేస్ అయినా ధైర్యంగా వెళ్ళే వారు. నిజనిర్ధారణ కమిటి పేరుతొ మిగతా సంఘాలను కూడా కలుపుకొని అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేవారు. సమస్య ఎక్కడ వుంటే అక్కడ బాలగోపాల్ వస్తారని అంతా ఎదురుచూసేవారు. పోలీసులకు నిద్ర పట్టేది కాదు. దాంతో తనపై రాజమ౦డ్రిలో దాడి చేసి చ౦పబోయారు. దగ్గరలో వున్న ప్రజలు కాపాడడ౦తో తలపై బలమైన గాయంతో బయటపడ్డారు. తరువాత రాజ్యహింస తో పాటు ఉద్యమ హింసను కూడా వ్యతిరేకించాలనే తీర్మానంతో ఆయన సి.ఎల.సిలో చర్చ పెట్టారు. కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే పోలిసులు సాగించిన కట్టుకథల ఎదురుకాల్పుల స౦ఘటనలకు వెంటనే స్పందించేవారు. రాజ్యానికి ఎప్పుడూ లోకువ కాలేదు. పూర్తికాలం హైకోర్టు న్యాయవాదిగా వుంటూ పేదల పక్షాన అనేక కేసులు వాదిస్తూ వారికి న్యాయాన్నిఅతి తక్కువ ఖర్చులూ అందుబాటులోకి తేవడానికి తన శాయశక్తులా కృషి చేసారు. మద్యన విజయనగరం జిల్లాలోని రాష్ట్రంలోనే అతి పెద్ద జూట్ మిల్లుగా పేరుగాంచిన నెల్లిమర్ల కార్మికుల జీతాలపై వారికి అనుకూలంగా తీర్పు తెచ్చారు. అలాగే లాకప్ డెత్లు ఆనాడు విరివిగా జరిగేవి. ఎవరూ పోలీసులకు వ్యతిరేకంగా మాటాడని రోజుల్లో తాను నిజనిర్ధారణ చేసి అనేక కేసులను హైకోర్టు వరకు తీసుకుపోయి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి దర్యాప్తు జరిగేట్లు చేయడానికి ఆయనే కారణం. అలాగే మరణించిన ఉద్యమకారుల పార్థీ శరీరాలను అతి దయనీయంగా పోలిసులు పాతేస్తూ, కిరోసిన్ పోసి కాల్చేస్తూ చివరి స౦స్కారానికి కూడా వారి బంధువులకు అవకాసం లేకుండా చేసేవారు. అలాగే పోస్టుమార్ట౦ తంతు కూడా వారికి అనుకూలంగా చేసుకునేవారు. వీటిపై కన్నాభిరాన్ గారితో కలిసి హైకోర్టులో పోరాడి సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి పోస్టుమార్టం కూడా నిపుణులైన డాక్టర్ల బృందంతో వీడియో తీస్తూ జరిగేట్టు కృషి చేసారు. గిరిజన ఆదివాసి ప్రా౦తాలలో ప్రతియేడు జరుగుతున్నా విషజ్వరాలపై వారి తరపున అలుపులేని పోరాటం చేసారు. అలాగే ప్రభుత్వం తూర్పు గిరిసీమలలోని బాక్సైటు ఖనిజాన్ని కొల్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు అమ్మేదానిపైనా అల్యుమినా ఫ్యాక్టరీ పెడితే కలిగే అనర్దాలపైన తీవ్రమైన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ద౦డ కారణ్యంలో సల్వాజుడుం పేరుతొ ఆదివాసి తెగలమధ్య పెట్టిన కార్చిచ్చుతో జరుగుతున్నా అమానవీయ హింసకు వ్యతిరేకంగా తను సొంతంగా పర్యటించి వ్యాసాలూ రాసి, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నారు. రాజ్యం పౌరుల హక్కులను హరి౦చే ప్రతి అంశంను న్యాయస్థాన౦ దృష్టికి తేవడానికి తద్వారా అభాగ్యులకు అ౦డగా నిలవడానికి అహర్నిశలు తన ఆరోగ్యం క్షీణిస్తున్న కృషి చేసిన నిరాడంబర జీవి. ఏనాడు అవార్డుల కోసం ఎదురుచూడని మనిషి. మద్య ఇస్తున్న రామన్ మాగాసేసే అవార్డు గ్రహీతలను చూస్తుంటే నవ్వు వస్తుంది. రాజ్యానికి అనుకూలంగా వున్న వారికి ఇలాంటి సత్కారాలు లభిస్తుంటాయి. అవి రాకపోవడమే బాలగోపాల్ నిబద్ధతకు తార్కాణం. తన చివరి ఉపిరి వరకు పేదల, దళితుల పక్షాన నిలిచి తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మనిషి మరి లేకపోవడం హక్కుల ఉద్యమానికే కాదు శ్రామిక, కార్మిక ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు తాడిత, పీడిత ప్రజలకు తీరని లోటు. ఇది ఇప్పట్లో భర్తీ అయ్యేది కాదు. పూర్తికాలం తనలా జీవితాన్ని అంకితం చేసిన మానవీయ కార్యకర్త, మేధావి ఉద్యమానికి దొరకడం చాలా కష్టం. తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం. ఆయన రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు.

5, అక్టోబర్ 2009, సోమవారం

థర్మల్ తో దుర్భిక్షమే..?


కోనసీమ తరువాత కొబ్బరికి పేరుగాంచిన ఉద్దాన వనం అదృశ్యం కానుందా? ఇందుకు శ్రీకాకుళం జిల్లా, సోంపేటను ఆనుకొని వున్న బీల ప్రాంతంలో నిర్మాణం కానున్న థర్మల్ ప్లాంటు కారణం కానుందా? అవుననే అంటున్నారు అక్కడ పరిశోధనలు గావించిన మేధావులు, పర్యావరణ నిపుణులు. ఎందుచేతనంటే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీసెర్చ్ కేంద్రం నేరీ (National Environment Engineering Institute) వారు 5 పవర్ ప్లాంటు ప్రాజెక్టులపై రీసెర్చి చేసి తెలిపిన వాటిలో మన రామగుండం ప్లాంటుకూడా వుంది. అక్కడ నిర్వాసితులలో సుమారు 5 కి.మీ.ల పరిధిలో ఉండే ప్రజలు అత్యధిక శాతం మంది శ్వాస కోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అది 1000 మె.వా.పవర్ ప్లాంటు. ఇక్కడ నిర్మించ తలపెట్టింది 2640 మె.వా.ది. మరి ఇక్కడి పరిస్థితి ఎంత భయానకంగావుండబోతుందో ఊహించుకొని ప్రజలు భయపడుతున్నారు.

అలాగే ప్రాజెక్టు నిర్మాణవలన వందలాదిగ్రామాలు నిర్వాశితులవుతారు. పంట పొలాలు నాశనం కాబడతాయి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టు, నదీజలాలు కలుషితం కాబడతాయి. థర్మల్ వ్యర్థ పదార్థాలతో సముద్ర జలాలు కలుషితం కాబడి అపార మత్స్యసంపద నాశనం అవుతుంది. వేలాదిమత్స్యకార కుటుంబాలు రోడ్ల పాలవుతాయి. సుమారు 10 కి.మీ.ల పరిధిలో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమయిపోతాయి. వీటికి ఉదా.గాపరవాడలోని థర్మల్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రాంతాలనే ఉదహరిస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంనకు ప్రభుత్వం ఇప్పటికే 11 వందల ఎకరాల బీల భూమిని కంపెనీకి అమ్మేసింది. సుమారు 12 వేల కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఈప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే్ జనవరిలోపనులు ప్రారంభిస్తామని నాగార్జున కంస్ట్రక్షంస్ ప్రకటించింది. ఇటువంటి పరిశ్రమలు స్థాపించాలంటే ముందుగా ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులతో greenbelt ఏర్పాటు చేయాలి అంటే సుమారు 3 లక్షల మొక్కలు నాటి వాటిలో బతికున్నవెన్ని అవి ఏదశలో వున్నాయో నివేదించాలి. కానీ నిబంధనలన్నీ గాలికొదిలి ప్రాజెక్టును చేపడుతున్న వైనం ప్రజలను ఉద్యమ బాట పట్టిస్తోంది.

ప్రజలను అన్ని విధాలుగా నిర్వాశితులను చేసే ఈ థర్మల్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రజాస్వామికవాదులు, మీధావులు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు తెలిపి వారి జీవన పోరాటానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక 05-10-2009 లోని వార్త అధారంగా)

2, అక్టోబర్ 2009, శుక్రవారం

గాంధీ - దాగిన మరో కోణం


మోహం దాస్ కరం చంద్ గాంధీ, జాతిపితగా, మహాత్మాగా మనకందరికీ తెలిసిన కోణం. కానీ అందరికీ సుపరిచితమైన ఆ ఆహార్యం వెనుక దాగిన నగ్న సత్యాలు అనేకం.

నిజానికి గాంధీ ఏనాడూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరి బ్రిటిష్ పాలకులు ఇరకాటంలో పడ్డ నాడు ఆ పోరాట రూపాన్ని వదులుకునేందుకు కూడా వెనకాడలేదు. ఇందుకు చౌరీ చౌరా సంఘటన జరిగినంతనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసారు. అలాగే బొంబయి రేవు కార్మికులు సమ్మెకు మధ్ధతుగా మన సైనిక దళాలు కూడా సమ్మె చేసేందుకు వెనుకాడని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి భద్రంగా తప్పుకునేందుకు అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయించాడు. ఇలా ఈ దేశం అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థగా మారడానికి సహకరించి సామ్రాజ్యవాదుల ఏజెంటుగా నమ్మిన బంటు పాత్రను అత్యంత నమ్మకంగా పోషించాడు.

అసలు కాంగ్ర్రెసు పార్టీ ఆవిర్భావమే బ్రిటిష్ పాలకులకు అణుగుణంగా జరిగింది. కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు ఎలెం ఓక్టాలియా హ్యూం ఒక బ్రిటిష్ ఉన్నతాధికారి. పార్టీ ఆవిర్భావ పరిస్థితి నాటి (1885) భయంకర కరువు పరిస్థితులు లోలోపల రగులుకొంటూ పైన నివురుగప్పిన నిప్పులావున్న భారతీయుల అసంతృప్తి, ద్వేషమూగ్రహించిన హ్యూం అప్పటి వైస్రాయి డఫరిం దగ్గరకెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ సూచన ఇలా వుంది:

“ భారత దేశంలో బద్దలవటానికి సిద్ధంగావున్న సాయుధ విప్లవాన్ని అడ్డగించడానికి ఒకే ఒక మార్గం వుంది. ప్రజలముందు చట్టబద్దమైన ఉద్యమాన్ని ఉంచుదాం. ఆఉద్యమంలో ప్రజలు పాల్గొని చట్టబద్దంగా తమ అసంతృప్తిని ప్రకటిస్తారు. దాన్ని బట్టి ప్రజలనాడి ప్రభుత్వానికి అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంచించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి సహకరించే ఉన్నతవర్గాల భారతీయులు నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రజల్ని విప్లవ మార్గం నుంచి తప్పించి చట్టబద్ధమైన ఉద్యమంవైపు లాగుతారు. అప్పుడు ఆ ఉద్యమం పైన బ్రిటీషు ప్రభుత్వం గట్టిపట్టును కలిగివుంటుంది.’ (యశ్ పాల్ రాసిన రామరాజ్యం – పేజీ 69).

దోపిడీవర్గాలకి దురాలోచనే కాక ఎంతటి దూరాలోచనా! జాతీయోద్యమాన్ని కాంగ్రెసు పార్టీ, గాంధీ ఇలానే నడిపించారు.

అయినప్పటికీ 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునసాగటం, మధ్యతరగతి యువకులు బ్రిటీషు ముష్కరుల పైన దాడులు చేయటం జరిగింది. పత్రికలలో వ్యాసాలు రాసినదానికే బాల గంగాధర తిలక్ కు 6 సం.ల కఠిన కారాగార శిక్ష విధించిన బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా బొంబాయి కార్మికులు హర్తాళ్ళ్, బంద్ లు నిర్వహించి రాజకీయాల్లోకార్మికులు క్రియాశీలక పాత్ర నిర్వహించే కాలం వచ్చిందనే హెచ్చరిక చేసారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించగల సమర్ధవంతమైన నాయకత్వం, బ్రిటీషు పాలకులకి దేశీయ భూస్వామ్య దళారీ బూర్జువాలకీ అవసరమయింది.

దక్షిణాఫ్రికాలో బ్రిటీషు పాలకులకి వ్యతిరేకంగాపోరాడిన ‘ జూలూ ‘ జాతి రైతుకూలీల పోరాటంలోనూ, బోయర్ యుధ్ధకాలంలోనూ, మొదటి ప్రపంచ యుద్ధం లోనూ బ్రిటీషువారికి తోడ్పడంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకోడానికి కూడా వెనుకాడనిప్రభుభక్తిని గాంధీ ప్రదర్శించాడు.(భారదేశంలోని ఇంగ్లీషు వారందరికీ – గాంధీ బహిరంగ లేఖ అధారం). తమకు కావలసిన వాడు ఇతడే అని గుర్తించారు.

ఉదా: బీహార్ లోని చంపారం లో నీలిమందు రైతుల పోరాటాన్ని సంస్కరణవాద ఊబిలోకి లాగటం, రౌలత్ చట్టానికి, జలియన్వాలా బాగ్ దురంతాలకు వ్యతిరేకంగా సాగిన ప్రజల ఆందోళన హద్దులు దాటుతోందని నిలిపివేయటం జరిగింది.

సామ్రాజ్యవాదుల ఎడల భారత ప్రజల అసంత్రుప్తి తీవ్రత ఎంతలా వుందంటే ఏ కొద్దొ రాయితీలు పొందే ఉద్యమానికి పిలుపునిచ్చినా లక్షలాదిగా తరలి వచ్చే వారు. ప్రజా పోరాట జ్వాలను చల్లార్చటానికి ఆఉద్యమాన్ని అడ్డుకట్ట వేయడానికి గాంధీ ‘ శాంతి ‘ మంత్రం జపించి వారి పునాదులను కాపాడే వాడు. అందుకే వారికి మహాత్ముడయ్యాడు.

1931 లో గాంధీ స్వభావాన్నిగూర్చి స్టాలిన్ చెప్పిన మాటలు “ భారతదేశం, ఇండోచైనా, ఇండోనేషియా, ఆఫ్రికాఖండంలోని దేశాల్లోని విప్లవ పోరాటాలని కసాయి బూర్జువా పరిపాలకులు రక్తపుటేరుల్లోముంచారు. కౄరమైన హింసావిధానం ద్వారా అక్కడి ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలు రెండు రకాలుగా జరిగాయి. ఒకటి – తుపాకీ ద్వారా విప్లవోద్యమాన్ని అణచడము , రెండవది – గాంధీ లాంటి వ్యక్తి ద్వారా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడమూ!”

అలాగే వైస్రాయి ఇర్విన్ రైలు పేలిపోయే విధంగా విప్లవకారులు బాంబులు పెడితే అవి పేలినా వైస్రాయి క్షేమంగా బయటపడ్డందుకు చాలా సంతోషించాడు. ఈచర్యను ఖండిస్తూ కాగ్రెసు సభలలో తక్కువ మెజారిటీతో తీర్మానాలు చేయించుకుని ప్రభుభక్తిని చాటుకున్నడు.. విప్లవ కారులను నిందిస్తూ ‘ కల్ట్ ఆఫ్ ది బాంబ్ “ అనేవ్యాసం రాసాడు. దీనికి జావాబుగా వారు ‘ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ “ రాసి అందులో గాంధీ స్వభావాన్ని ఇలా పేర్కొన్నారు:

“ కాంగ్రెసు ప్రజలలోస్వాతంత్ర్య ఇచ్చను కలిగించిందని మేమూ ఒప్పుకుంటాం. అయితే అంతటితో కాంగ్రెసు బాధ్యత తీరిపోలేదు. దేశానికి కాంగ్రెసు చేయవలసినది ఎంతో వుంది. కానీ ఆసంస్థ మీద దళారీరాజకీయాలను అభిమానించే నాయకుల ప్రాబల్యం ఎక్కువైంది. కాంగ్రెసు చెప్పే అహింస విదేశీ పాలకులతో రాజీ బేరాలకు దిగడానికి ఒక సాకుగా తయారయ్యింది.”

గాంధీ-నెహ్రూల నాయకత్వం భగత్ సింగు తదితరుల ఉరిశిక్ష రద్దుకు సీరియస్ గా ప్రయత్నించనిది దళారీ రాజకీయాల కారణంగానే. కరాచీలో నెహ్రూ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెసు సమావే్సానికి (మార్చి 25 1931 న) ఏ అడ్డంకీ రాకుండా వుండేందుకు భగత్ సింగు, రాజగురు, సుఖదేవ్ ల ఉరిని 23 రాత్రి 7.30 ని.లకి ( చట్టానికి వ్యతిరేకంగా రాత్రి ఉరితీయరాదు) అమలుచేయించాడు.

ఈదేశప్రజలలో మత మౌఢ్యాన్ని పెంచడానికి తాను అనుసరించిన సనాతన ధర్మం, మత మార్పిడుల పట్ల వ్యతిరేకత తోడ్పడ్డాయి.

హి వాజ్ ఏక్టెడ్ ఏజ్ ఏన్ ఇన్విజిబిల్ ప్రొటెక్టర్ టు ది బ్రిటిష్ రాజ్ ఎండ్ ఇండియన్ బూర్జువాజీ.

(ఈ వ్యాసం రాయడానికి ‘ నా నెత్తురు వృధాకాదు ‘ పుస్తకంలోని వ్యాసాలను ఆధారం చేసుకున్నాను.)