30, జనవరి 2010, శనివారం
ప్రకటనల్లో కూడా పేదవారు మన శాస్త్రీజీ
తన జీవితమంతా అత్యంత నిరాడంబరంగా గడిపి, నాటి నుండి నేటి వరకున్న నాయకులలో అత్యంత నిజాయితీ పరుడిగా అందరిచేత మన్ననలందుకొని, దేశం అత్యంత క్లిష్టపరిస్థితి (పాకిస్తాన్ తో యుద్ధం) సమయంలో భారత ప్రధానిగా బాధ్యతలొనరించిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన భారత పాలకవర్గాలు గత 10 సం.లుగా ప్రచారానికి పెట్టిన ఖర్చు 87 లక్షలు మాత్రమే. అదే సమయంలో గత రెండు నెలల్లో మాజీ ప్రధాని, దేశంలో అత్యంత భారీ రక్షణ కుంభకోణం మచ్చకలిగిన రాజీవ్ గాంధీపై ప్రకటనలకు పెట్టిన ఖర్చు సుమారు రూ.3 కోట్లు. ఈ వివరాలను ముంబైకి చెందిన అజయ్ మరాఠే సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టారు. పాలకవర్గాల అదుపులేనితనానికి గుర్తుకాదా?
26, జనవరి 2010, మంగళవారం
గణతంత్ర దినోత్సవం – సవర గిరిజనుడు
మా వూరికి దగ్గరలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఈ రోజు హాజరయ్యాను. పిల్లలంతా సర్కారు వారు సప్లై చేసిన పొడుగు చేతుల బుష్ కోటు, లావు నడుము నిక్కర్లను మొల్తాడుకు బిగించి క్యూలలో నిల్చొని ఝెండా కర్రముందు వరుసలలో నిల్చున్నారు. ఇద్దరు విదార్థినులు ప్రార్థానాగీతం శుక్లాంబరధరం శ్లోకం తరువాత వందేమాతరం, తరువాత మా తెలుగు తల్లికి పాడి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఝెండా గీతం మూడు రంగుల ఝెండా, ముచ్చటైనా ఝెండా పాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఝెండానెగరేసారు గణతంత్ర దినోత్సవం గురించి నాలుగు మాటలు చెప్పి, గ్రామపెద్దలను, మిగిలిన ఉపాధ్యాయులను మాటాడమన్నారు.
యింతలో అటువైపుగా పల్లం గ్రామంలో అమ్మకానికి వంట చెరుకుగా ఉపయోగించే కట్టెల కావడిని భుజాన మోసుకొస్తూన్న మంగన్న తన ఆయాసాన్ని తీర్చుకునేందుకు, బోరింగు దగ్గర నీళ్ళు తాగేందుకు ఆప్రక్కగా ఆగాడు.
అది చూసిన నేను మంగన్నా యిటు రా అని పిలిచాను.
‘ఏటి బాబూ’ అని వచ్చాడు.
యిలాయీవరసలోవుండి మన జాతీయ ఝెండాకు దండం పెట్టుకో, అలా మన పెద్దలు చెప్పిన మాటలు విని బిస్కట్లు, బిల్లలు తీసుకో అన్నాను.
‘ఏటి బాబూ ఇసయం’ అంటూ దగ్గరగా వచ్చాడు.
యింతలో మా శంకర్రావు మాస్టారు మంగన్నా, మన మూడు రంగుల ఝెండా పిన్నీసుతో దోపుకోమని ఇచ్చాడు.
అది అందుకున్న మంగన్న చుట్టూ చూసాడు. తన ఒంటిపై గోచీ తప్ప ఏ ఆచ్చదనా లేదు. మేం మాత్రం చొక్కాలకు పిన్నీసులతో మూడు రంగుల ఝెండా గుచ్చుకొని దేశభక్తిని చాటుకుంటున్నాం.
అలా చుట్టూ చూసిన మంగన్న ఠక్కున మేమిచ్చిన ఝెండాను తన మొలకున్న గోచీకి తగిలించి భుజానకు కట్టెల మోపునెత్తుకొని సాగిపోయాడు.
అది చూసిన మాకు మాటరాలేదు....
24, జనవరి 2010, ఆదివారం
ఇది అనైతికం కాదా?
AP girls used for vaccine demo
పై Head lines తో నిన్నటి Deccan Chronicle లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో 30 వేలమంది 10 నుండి 14 సం.ల మద్యనున్న గిరిజన బాలికలపై ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలోను, గుజరాత్ లోని వడోదర జిల్లాలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై సెర్వికల్ కేంసర్ వ్యాధి నిరోధక టీకాలను ప్రయోగాత్మకంగా ఇప్పటికి రెండుమార్లు ఉపయోగించారని రాసారు. ఈ “demonstration project” లక్ష్యం ప్రభుత్వం తన Immunisation prograamme లో వాడుతున్న vaccine లలో దీనిని కూడా కలుపుకునేట్లు ఒప్పించేందుకు.అనగా దీనిని ఒక యూ.ఎస్, కేంద్రంగా ఉత్పత్తి జరుపుతున్న మల్టీ నేషనల్ కంపెనీ వారిదగ్గరనుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి ఒప్పండం కుదుర్చుకోవడానికట. ప్రస్తుతం ఈ vaccine అమ్మకానికి భారత్ లో దొరుకుతోండంట.
ఇప్పటివరకు 24,164 మంది గిరిజన అమ్మాయిలపై ప్రయోగించారు. ఇది 3 డోసులుగా 6 నెలల వ్యవధిలో ఇవ్వాలి. ఇప్పటికి 2 మార్లు ఇవ్వడమైనది. దీని పేరు GARDASIL. ఇది వ్యాధి రాకుండా మత్రమే చూస్తుంది. క్యూర్ చేయదు. NGOPATH (India) అనే సంస్థ తో పాటు ఏఫీ , గుజరాత్ ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రయోగాలు చేస్తున్నారు.
కానీ ఢిల్లీ కేంద్రంగా గల సహేలి మరియు సామా అనే సంస్థలు ఈ వాక్సిం ప్రయోగాలపై పరిశోధించగా ఇది బాలల హక్కుల ఉల్లంఘనగా గుర్తించారు.
“The vaccine,” these activists allege, ‘has been widely administered in the First World and has created several debilitating reactions, including clotting disorders, nervous system disorders and has also has resulted in the death of healthy young girls which caused batches of the drug be withdrawn.”
ఇలా అమాయక గిరిజన బాలికలపై ఇటువంటి వాక్సిం లు ప్రయోగించడం అనైతికం కాదా? వారి ప్రాణాలతో చెలగాటమాడవచ్చా? ఇది పాలక వర్గాల పైశాచిక వ్యాపారధోరణి కాదా?
(Deccan Chronicle Dated 23-01.10 లోని వార్త ఆధారంగా)
22, జనవరి 2010, శుక్రవారం
మీ రక్తాన్ని ధారపోయండి – మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను – నేతాజీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ - భారత స్వాతంత్ర్య సమరంలో ఒక పోరాట అధ్యాయం. భారత ప్రజల స్వేచ్చా కాంక్షకు ప్రతిరూపం. తను చేసినది ఎన్ని విమర్శలకు గురైనా తన దేశ బానిస విముక్తి కోసమే పోరాడిన వీరయోధుడిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. జరిగిన చరిత్రంతా అందరూ ఎరిగినదే. గాంధీ తన మాట జవదాటని నెహ్రూని భావి భారత నాయకుడుగా ప్రతిష్ఠించే పనిలో మరో నాయకున్ని ఎదగనివ్వని క్రమంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించిన వాడు నేతాజీ. మొదటినుండి గాంధీ బ్రిటిష్ వారితో లాబీయింగ్ ద్వారా నాయకత్వ మార్పునకు ప్రయత్నించడంతో 2వ ప్రపంచ యుద్ధకాలంలో బలహీనపడ్డ బ్రిటిష్ రాజ్ ను చావు దెబ్బకొట్టి భారత దేశ బానిస సంకెళ్ళను తెంచడానికి నాజీ సేనలతో జతకట్టి అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి భారత సైన్యాధ్యక్షుడు నేతాజీ. చరిత్రలో ఆయన ధీరోదాత్తతను మరుగునపరిచే కుట్రలు యింకా జరుగునూనే వున్నాయి. ఈనాటికీ తన మరణ రహస్యం కప్పబడి వుంది. ఇది భారత పాలకవర్గాల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఏమైనా కానీ భారతంలో కర్ణుడి పాత్రలా తాను ఓడినా భారత ప్రజల హృదయాలలో తన మేరు గంభీర రూపం చిరస్థాయిగా నిలిచిపోతుంది.(ఈ రోజు నేతాజీ 113వ జయంతి సందర్భంగా)
మరాఠీ తాలిబన్లు
17, జనవరి 2010, ఆదివారం
నయా రివిజనిస్టు జ్యోతిబసు వారసులున్నారు జాగ్రత్త
డాంగే విధానాలను వ్యతిరేకించి C.P.I. వారిని రివిజనిస్టులుగా, ఇందిరా గాంధీ అనుయాయులుగా ముద్రవేసి తాము బయటకు వచ్చిన కొద్ది రోజులకే అదే రివిజనిస్టు పంథా, పార్లమెంటరీ మార్గంలో పార్టీ శ్రేణులను నడిపిన ఘనత C.P.M. నాయకత్వానిదే. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆదినుండి నడిపించిన జ్యోతిబసు నయా రివిజనిస్టే.
ఈ దేశంలో ప్రజాఉద్యమాలకు భయపడి, కోకోకోలా కంపెనీని నిషేధిస్తే, దానిని మరల కేరళ వామపక్ష ప్రభుత్వమే మొదట ఆహ్వానం పలికింది. దీనికి వత్తాసు పలికింది ఏచూరి కమిటీ. బలపరిచినది నాటి రాజకీయ నాయకత్వమే. ఈ విధంగా సామ్రాజ్యవాద కంపెనీలకు మొదటినుండి బార్లా తలుపులు తెరిచి ఆహ్వానించింది CPM నాయకత్వం.
అలాగే ఈ కుహనా కమ్యూనిస్టు ప్రభుత్వం యొక్క భూసంస్కరణల డొల్ల తనానికి వ్యతిరేకంగా నక్సల్బరీ రైతాంగ ఉద్యమం మొదలైనప్పుడు అత్యంత కౄరంగా అణచివేసినది CPM నాయకత్వంలోని ప్రభుత్వమే. ఆ కాలంలో (1967-69) బెంగాల్ ఉప ముఖ్యమంత్రి పదవిలో వున్నది బసు. రైతాంగ విప్లవ కార్యకర్తల రక్తం రుచిమరిగిన CPM నాయకత్వం తదనంతరం తమ పార్టీ శ్రేణులను సాయుధ ముఠాలుగా మార్చి, తమ ఏకచ్చత్రాధిపత్యాన్ని సాగించడానికి అణువుగా మార్చుకున్నాయి.
బయటకు కమ్యూనిస్టు ఎఱ జెండా ముసుగులో నందిగ్రాం, సింగూర్ లలో టాటా కంపెనీకి రైతాంగం భూములను వేలాది ఎకరాలను అమ్మి వేసింది కూడా బసు ప్రభుత్వమే. దానిని అడ్డుకునే క్రమంలో, విప్లవ శ్రేణులు తమ అలుపెరగని పోరాటం ద్వారా అడ్డుకుంటుంటే నేటికీ ఈయన ప్రియ శిష్యుడు బుద్ధదేవ్ గారు పారామిలటరీ బలగాలతో ఉక్కుపాదంతో అణచివేయడానికి నిరంతరం కేంద్రంతో లాలూచీ పడుతున్నారు. తృణమూల్ ను అడ్డుకునేందుకు సోనియాతో మంతనాలు జరిపింది బసుగారే.
ఈ విధంగా ప్రజా వ్యతిరేక కౄర పాలన సాగించడమే కాకుండా తన స్వంత కుమారునికి సుమారు 600 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలేర్పాటుచేసి తన స్వంత ఆస్తిని కూడబెట్టుకున్నారు. ఇది జ్యోతిబసుగారి గురించి తెలిసిన కొంత సమాచారమే. చనిపోయిన వాని కళ్ళూ చారడేసిలా ఈనాడు ఒక్కో పాలకవర్గ దోపిడీ పార్టీ నాయకులు పోటీపడి సంతాప తీర్మానాలు చేయడం వారి సంఘీభావాన్ని తెలియజేస్తుంది.
ఈ నయారివిజనిస్టుల వారసులపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి.
10, జనవరి 2010, ఆదివారం
కూలిన ఒక్క ఆధారమూ...
ఈనాడు తెలుగు సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. మన ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో? సత్యాన్ని తెలుసుకునే అవకాశం సామాన్యులకు దూరమైన వైనం చూస్తుంటే గుండాగినంతపనౌతోంది. వీళ్ళ వ్యాపార లాభాల మద్య ఇన్నాళ్ళూ ఆధారపడ్డ నాలుగోస్థంభంగా ఆధారపడ్డ దానిని కూడా పునాదులతో కూల్చివేస్తున్నారు. స్వచ్చతను కోల్పోయిన తరువాత ఇంక ప్రజలు వీళ్ళీమి చెప్పినా నమ్మరు. అదుగో పులి కథలా, చివరాఖకి అంతా రాజ్యమన్న పులి నోట్లోకి పయనిస్తున్నాం. పాలకులు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతోంది. ప్రజల విశ్వసనీయతను కోల్పోయేట్లుగా చేసి తద్వారా తమ చీకటి కార్యకలాపాలను కానిచ్చే అవకాశాన్ని చేజేతులా ఇచ్చారు. దీనివలన జరగబోయే దారుణాలు మరింత పచ్చి నెత్తురు వాసనేస్తాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తమ గురివిందగింజతనాన్ని నిస్సిగ్గుగా బట్టబయలు చేస్తుంటే రాజకీయ దళారులు పగలబడి నవ్వుతున్న వైనం చూసి గుండె తరుక్కుపోతుంది.
ఇకనైనా సమాజంలో తమ స్థానాన్ని, అవసరాన్ని గుర్తెరిగి మెలగుతారని ఆశించడం అత్యాశేనా?
8, జనవరి 2010, శుక్రవారం
మీడియా - నడమ౦త్రపు సిరికి విషపుత్రిక
ఈ రోజు రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోవడానికి ఈ మీడియా కథనాలే కారణం. ఎప్పుడో 4 నెలల క్రితం ప్రచురించబడ్డ వార్తను చూపించి గంటలకొద్ది దానిపై విశ్లేషణలు ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, గూండాల దాడులను ప్రోత్సహించిన వైనం అత్యంత విషాదకరం. దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎంతో exciting గా ఆ యాంకర్ చెప్పడం చూస్తుంటే వీళ్ళూ వార్తా ప్రసారకులా లేక విషప్పురుగులా అనిపించింది.
బూతు సీన్లతో బుల్లి తెరను నింపి నట్టింట్లో నగ్న నృత్యాలు చేస్తున్నాయి. పసిపాపల స్వేచ్చను హరించె డాన్సు పోటీలు, వారి గొంతులపి ముళ్ళమాటల తో దాడి చేస్తూ, పిచ్చి తల్లిదండ్రుల వెఱి ఆవేశాలను సొమ్ముచేసుకుంటున్నాయి. ఇంతవరకు సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం ఒక్కటి లేదు. జరిగిన దానిని గోరంతలు కొండంతలు చేస్తూ, మూర్ఖపు వ్యాఖ్యానాలతో, అతి తెలివి తీర్మాణాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఉద్రేకాలను రెచ్చగొడుతు వయాగ్రా మాత్రలలా తయారయ్యాయి. ఈ చానళ్ళ వెనక ఒక్కో దానికీ ఒక్కో రాజకీయ పార్టీల అండదండలున్నాయనడం నగ్న సత్యమే. ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రసారాలను నియంత్రించకపోవడం మన రాజకీయ రాబందుల అవకాశవాదాన్ని బయటపెడుతోంది.మరల వీళ్ళలో వీళ్ళే ఆ చానల్ యిలా ఈ చానల్ ఇలా చేసిందని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం. ఈ పోటీ వాతావరణం సమాజాన్ని చెడగొడుతోంది. కావున విజ్నులైన ప్రజలే వీటిని సామాన్య జనానికి అర్థమయ్యేట్లు చెప్పాలి. ప్రతి ప్రింట్ మీడియా వాడు ఒక్కో చానెల్ పెడుతూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలార్జిస్తూ ప్రజల మనోభావాలను దేబ్బతీస్తున్నారు. ఇంకా మేలుకోకపోతే సమాజంలో అరాచకం ప్రబలిపోతుంది. తస్మాత్ జాగ్రత జాగ్రత.
3, జనవరి 2010, ఆదివారం
వనవాసి హిమాంశు కుమార్ అరెస్టును ఖండిద్దాం
ఈ లింక్ లో VCA పై అమలుజరుగుతున్న నిర్బంధాన్ని గూర్చి వివరంగా చదవచ్చుఃhttp://aidindia.org/main/content/view/908/343/